పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్రో చిత్రం మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. మొదటిసారి మామ(Pawan Kalyan),అల్లుడు(Sai Dharam Tej) కలిసి నటించిన చిత్రం కావడంతో మెగా అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సముద్రఖని(Samuthirakani) డైరెక్టర్‌గా వ్యవహరించారు. తమిళంలో 2021లో విడుదలైన “వినోదయ సీతం” అనే సినిమాకి ఇది రీమేక్‌గా రాబోతోంది. పవర్ స్టార్ ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో నిడివి పెంచుతూ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కీలక మార్పులు చేశారు.
జులై 28న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో మెగా అభిమానులకు సాయితేజ్(Sai Dharam Tej) కీలక విన్నపం చేశారు. ‘ఇంతకాలం మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. చిత్ర విడుదలకు ముందే మీరు చేసిన సంబురాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. ప్రస్తుతం వాతావరణం సరిగా లేనందున అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్లెక్సీలు, కటౌట్లు కట్టేప్పుడు అతి జాగ్రత్తలు పాటించండి. మీకేదైనా జరిగితే పవన్ కల్యాణ్ గారు అస్సలు తట్టుకోలేరు. ఆయనే కాదు ఇప్పుడు తట్టుకునే శక్తి నాకూ లేదు. దయచేసి అందరూ జాగ్రత్తగా సెలబ్రేషన్స్ చేసుకోండి’ అంటూ సాయితేజ్ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ నోట్ విడుదల చేశారు.