Purandeswari | ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. విమర్శలు ప్రతి విమర్శలతో నేతలు స్పీడు పెంచారు. జనసేన అధినేన పవన్ కల్యాణ్(Pawan Kalyan) సైతం సినిమా షూటింగ్‌లకు గ్యాప్ ఇచ్చి విస్తృతంగా రాజకీయ సమావేశాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్నారు. దీంతో ఏపీలో బీజేపీ, జనసేన పార్టీల పొత్తు దాదాపు ఖరారైంది. ఇదిలా ఉండగా.. బీజేపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని హైకమాండ్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె దగ్గుపాటి పురందేశ్వరి(Purandeswari)ని ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుగానే ప్రకటించి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్య బాధ్యతలు పురందేశ్వరికి అప్పగించినట్లు సమాచారం. అంతేగాక, పురందేశ్వరి విశాఖ జిల్లా నుంచి బరిలోకి దిగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పురందేశ్వరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేనతో కలిసి ఎన్నికలకు వెళితే మంచి ఫలితాలు వస్తాయని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. మరి దీనిపై జనసేన ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.