మాజీ మంత్రి టిడిపి సీనియర్ నేత నారాయణ(Ex minister Narayana)పై ఆయన తమ్ముడి భార్య కృష్ణప్రియ సంచలన ఆరోపణలు చేశారు. తనపై నారాయణ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెబుతూ నెల రోజులుగా సోషల్ మీడియా వేదికగా పలు వీడియోలు రిలీజ్ చేశారు. అంతేకాదు, ఆదివారం ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నారాయణకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చారు. ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఈ వ్యవహారంపై కృష్ణప్రియ భర్త సుబ్రహ్మణ్యం స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు.
నా భార్య కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని, ఆమె వీడియోలో చెబుతున్న విషయాలు పట్టించుకోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబంపై, సోదరుడు నారాయణపై ఆమె చేస్తున్న ఆరోపణలు నిజం కాదని తెలిపారు. ఆమె చేస్తోన్న వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని అందుకే వీడియో ద్వారా వివరణ ఇస్తున్నట్టు తెలిపారు. ఆమె అనారోగ్యానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ కూడా సుబ్రహ్మణ్యం ఈ వీడియోలో చూపించారు.
అయితే, నారాయణ(Ex minister Narayana) తనను రెండున్నర దశాబ్దాలుగా వేధిస్తున్నాడని ఆరోపిస్తున్న కృష్ణప్రియ… అకస్మాత్తుగా ఇప్పుడు ఫిర్యాదులు చేయడంపై రకరకాల అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. నారాయణ కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కొడుకు మరణం, నారాయణ విద్యాసంస్థలపై రైడ్స్, అమరావతి లాండ్ పోలింగ్ వ్యవహారంలో చంద్రబాబుతో పాటు ఈయన కూడా సిఐడి నోటీసులు రావడం ఆయన్ని మానసికంగా కృంగదీసాయని సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఇంతకాలం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారని వారు అంటున్నారు.
ఇక ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో నెల్లూరులో ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు. టిడిపి అధిష్టానం ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోని ఆయనను పొలిటికల్ గా వీక్ చేసేందుకు.. నారాయణ మరదలితో వైసిపి డ్రామా ఆడిస్తున్నట్టు టిడిపి వర్గాలు మండిపడుతున్నాయి. మరోవైపు ఆమె, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై సైతం విమర్శలు గుప్పించడంతో, వైసీపీకి దగ్గరందుకే కృష్ణప్రియ ఇలా చేస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.