Hyderabad | ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ ప్రేమలు పెరిగిపోతున్నాయి. ఫేస్ బుక్ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయాలు పెంచుకొని తెగ ప్రేమించేసుకుంటున్నారు. అంతేగాక, ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా ఏర్పరచుకున్న పరిచయాలూ ప్రేమకు దారి తీస్తున్నాయి. ఇందులో కొన్ని పెళ్లి వరకు తీసుకెళ్లగా.. మరికొన్ని మధ్యలోనే బ్రేకప్ అవుతున్నాయి. ఇంకా కొందరు అవసరాలకు వాడుకొని వదిలేస్తుండగా.. ఇంకొందరు లొంగకపోతే దారుణాలకు పాల్పడుతున్నారు.
తాజాగా.. హైదరాబాద్(Hyderabad) నగరంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మధురానగర్‌కు చెందిన ఓ యువతి తరచూ ఫోన్‌లో పబ్జీ గేమ్(Pubg Game) ఆడుతుండేది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. దీంతో అతనితో ఏర్పరచుకున్న స్నేహం ప్రేమకు దారి తీసింది. అనంతరం నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుకోవడం వంటివి చేసుకున్నారు. చివరకు యువతి నగ్న ఫొటోలు చూపి వేధించసాగాడు. లైంగికదాడులకు సైతం యత్నించినట్లు సమాచారం. ఇటీవల వేధింపులు ఎక్కువ కావడంతో సదరు యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.