కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై లోక్‌సభలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్ రాష్ట్రంలో భారతమాత హత్య జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గజినీలా మారారని ఎద్దేవా చేశారు. రాహుల్ వ్యవహారశైలి చూసి ప్రపంచం నవ్వుకుంటోందని విమర్శించారు. భారతమాత హత్య ఎప్పటికీ జరగదని.. భారత్ వైపు కన్నెత్తి చూస్తే కళ్లు పీకేసే సమర్థుడైన ప్రధాని మోదీ ఉన్నారని తెలిపారు. మోదీ నేతృత్వంలోని దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం 1400 మంది యువత బలి దానాల తర్వాత యూపీ ప్రభుత్వం 2014లో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిందన్నారు. అప్పటి కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్.. కాంగ్రెస్ ఇవ్వకుంటే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఇస్తామని చెప్పడంతో గత్యంతరం లేక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ ప్రజలకు చిన్నమ్మ అండగా ఉంటామని చెప్పారని బండి గుర్తుచేశారు.
తెలంగాణ ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ పాలన కొనసాగుతోందని సీఎం కేసీఆర్(KCR)పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ రాత్రంతా తాగడం, ఉదయం పడుకోవడం, ఎవరినీ కలవకపోవడమని ఎద్దేవా చేశారు. ఈ తొమ్మిదేళ్లలో కేసీఆర్, ఆయన కుటుంబ ఆస్తులు భారీగా పెరిగాయన్నారు. కానీ ప్రజలు మాత్రం అప్పుల్లో కూరుకుపోయారన్నారు. కేసీఆర్ కొడుకు ఆస్తులు 400 రెట్లు పెరిగాయని నిప్పులు చెరిగారు. కేసీఆర్ అవిశ్వాసానికి ఎందుకు మద్దతిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మోదీ మణిపూర్(Manipur) ఎందుకు పోలేదంటున్నారని, కానీ రైతులు, యువత, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే సీఎం కేసీఆర్ ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి లేదన్నారు. పలు ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా రాలేదన్నారు. తెలంగాణ ప్రజలకు ఒకటే చెబుతున్నా కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్ ఒక్కటే.. ఈ మూడు పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే అని బండి(Bandi Sanjay) వెల్లడించారు.