కాంగ్రెస్(Congress) పార్టీతో వామపక్షాల పొత్తు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. చెరో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి కేసీఆర్ మోసం చేశాడని ఆగ్రహంతో ఉన్న సీపీఐ, సీపీఎం పార్టీలు ఈ ఎన్నికల్లో ఎలాగైనా కేసీఆర్‌ను భారీ దెబ్బకొట్టాలని చూస్తున్నాయి. అందుకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే సాధ్యపడుతుందని భావించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్ రావు థాక్రే రాష్ట్ర వామపక్ష నేతలతో వేరు వేరుగా ఫోన్లో మాట్లాడారు. లెఫ్ట్ పార్టీలు చెరో మూడు సీట్లు కావాలని అడగ్గా.. చెరో రెండు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఇవాళ ఇరు పార్టీల నేతలు భేటీ అయినట్లు సమాచారం. అయితే, బీఆర్ఎస్‌తో ఎదురైనా పరిణామాల దృష్ట్యా సీపీఎం ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇక ఆల్రేడీ బీఆర్ఎస్ చేతిలో మోసపోయిన వామపక్షాలు మరోసారి మోసపోవద్దని భావిస్తున్నారు. సీపీఎం ఆశించే స్థానాల్లో కాంగ్రెస్(Congress)కు రెండూ సిట్టింగ్ స్థానాలే ఉండటంతో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. భద్రాచలం, మధిర, పాలేరు, మిర్యాలగూడ స్థానాలను సీపీఎం ఆశిస్తుంది. దీనిలో ఏవో రెండు టికెట్లు ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. దీనిపై ఇవాళ లేదా రేపు అధికారిక ప్రకటన రానుంది.