ఆసియా కప్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 2వ తేదీన మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా, పాక్ మ్యాచ్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్(Salman Butt) సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్ర ఒత్తిడి ఉండే భారత్-పాక్ మ్యాచ్ లో సత్తా చాటాలంటే ఎంతో అనుభవం ఉండాలని అభిప్రాయపడ్డాడు. భారత జట్టు పూర్తిగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే ఆధారపడి ఉందని, ఈ ఇద్దరిని ఔట్ చేస్తే సునాయాసంగా విజయం సాధించవచ్చని తెలిపాడు. ప్రస్తుతం టీమిండియాను గాయాల బెడద వేధిస్తోందని అన్నారు.
పేస్ బౌలింగ్ యూనిట్ లో ప్రధాన బౌలర్లందరికీ ఫిట్‌నెస్ సమస్యలున్నాయి. మహ్మద్ షమీ చాలా రోజులుగా క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. మహమ్మద్ సిరాజ్ కూడా గాయంతో ఇబ్బంది పడి రీఎంట్రీ ఇస్తున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా ఏడాదిగా జట్టుకు దూరంగా ఉన్నాడు. బ్యాటింగ్ యూనిట్ కూడా అంత గొప్పగా ఏం లేదు. విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) తప్ప మిగిలిన యువ ఆటగాళ్లు ఎప్పుడు ఆడుతారో కూడా తెలియదు. ఎవరికీ కూడా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం అంతగా లేదు. ఇటీవల కాలంలో టీమిండియా గెలిచిన అన్ని మ్యాచుల్లో కోహ్లీ లేదా రోహిత్ శర్మ రాణిస్తేనే విజయాలు అందుకున్నారని సల్మాన్ బట్(Salman Butt) సంచలన వ్యాఖ్యలు చేశారు.