వన్ నేషన్.. వన్ ఎలక్షన్(One Nation One Election)పై కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్(Ram Nath Kovind)ను నియమించింది. కమిటీ సభ్యులుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అధిర్ రంజన్, ఆజాద్, ఎన్‌కే సింగ్, సుభాస్, హరీశ్ సాల్వే, సంజయ్ కోతారిలను ఎంపిక చేశారు. కాగా, కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ విధానాన్ని పలు పార్టీలు వ్యతిరేకిస్తుండగా.. పలు పార్టీలు మద్దతిస్తున్నాయి. ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ఈ నినాదం ఎత్తుకున్నదని విపక్షాలు ఆరోపిస్తుండగా.. జమిలి ఎన్నికల ద్వారా దేశంలో ప్రజాధనం ఆదా అవుతుందని ఎన్డీఏ మిత్ర పక్షాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం ఏకంగా కమిటీని నియమించడం, శనివారం అధికారంగా ప్రకటించడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది.
జమిలి ఎన్నికలకు రామ్‌నాథ్ కోవింద్ మద్దతు!
జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చైర్మన్‌గా శనివారం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కేంద్రమంత్రి అమిత్ షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాశ్ కశ్యప్, సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి సభ్యులుగా ఉండనున్నారు.
‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు (One Nation One Election)’తో ఒకేసారి లోక్‌సభ, రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కమిటీ అధ్యయనం చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. జమిలి ఎన్నికల అంశంపై నిపుణులతోపాటు రాజకీయ పార్టీల నేతలతో కమిటీ సమావేశం కానున్నదని, వారి అభిప్రాయాలు తీసుకొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రధాని మోదీ జమిలి ఎన్నికల నిర్వహణ అంశాన్ని నొక్కి చెబుతూనే ఉన్నారు. 2017లో రాష్ట్రపతి అయిన రామ్‌నాథ్ కోవింద్ కూడా మోడీ అభిప్రాయానికి మద్దతు పలికారు.