G 20 శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ నగరం ముస్తాబయింది. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన దేశాల అధినేతలు, వారి తరపున ప్రతినిధులు రానుండడంతో దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, కేంద్ర బలగాలు నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిర్దేశిత ప్రాంతాల్లో నేటి నుండే నిషేధాజ్ఞలు అమలు చేయనున్నారు. రోడ్డు రైలు వాయిమార్గాల్లో పలు ఆంక్షలు విధించారు. ప్రపంచ దేశాధినేతలు హాజరవునుండడంతో ఏ చిన్న అవాంఛనీయ ఘటన జరిగినా అంతర్జాతీయంగా భారత్ పై ఆ ప్రభావం పడే ప్రమాదం ఉండనుండడంతో సెక్యూరిటీ విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు.
ఏ మూల చీమ చిటుకుమన్నా తెలిసిపోయేలా సీసీ కెమెరాలతో డేగ కన్ను వేశారు. డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది. మూడు రోజులపాటు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇవాళ రాత్రి నుంచే నిర్దేశిత ప్రాంతాల్లో ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఢిల్లీ నగరంలో స్విగ్గి, జొమాటో, అమెజాన్ వంటి ఆన్లైన్ డెలివరీలను కూడా నిషేధించారు. ఈరోజు అర్ధరాత్రి నుంచి పదవ తేదీ అర్ధరాత్రి వరకు ఢిల్లీలోని వాహనాల ప్రవేశాన్ని కూడా నిలిపివేస్తున్నట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అలాగే నగరంలో 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పబ్లిక్ హాలిడే ప్రకటించారు. 9, 10వ తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ఇచ్చారు. ఆంక్షలు అమల్లో ఉన్న నిర్దేశిత ప్రాంతాల్లో థియేటర్లు, రెస్టారెంట్లు మూసివేయలని ఆదేశాలు జారీ చేశారు.
ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే 160 దేశ విమాన సర్వీసులు రద్దు కానున్నాయని ఢిల్లీ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ వెల్లడించింది. సదస్సు కోసం ఎయిర్పోర్టులో అన్ని రకాల పరికరాలు, పార్కింగ్ సౌకర్యాన్ని సిద్ధంగా ఉంచారు. జీ 20 శిఖరాగ్ర సదస్సులో భద్రత దృష్ట్యా 8 నుంచి 10వ తేదీ వరకు ఢిల్లీ మెట్రో సర్వీసుల్లో మార్పులు చేయనున్నారు. అలాగే, పలు రైళ్ల రాకపోకలు రద్దు చేశారు. కొన్ని రైళ్లను తాత్కాలికంగా మళ్ళించారు. ఢిల్లీలో అడుగుపెడుతున్న ప్రతి ఒక్కరిని స్కాన్ చేసేందుకు సీసీ కెమెరాల్లో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో జోడించారు. ఇమేజెస్ తో పాటు ఆడియో డేటాని కూడా ఇక సేకరించగలదని అధికారులు తెలిపారు. సదస్సు జరుగుతున్న రోజుల్లో దేశ రాజధానిలో హైలర్ట్ కొనసాగునుండడంతో.. ఆ మూడు రోజుల్లో నిత్యావసర సరుకులు మాత్రమే ఢిల్లీ ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి.