టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా అర్ధరాత్రి చంద్రబాబును అరెస్ట్ చేశారని.. జగన్ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఏ తప్పు చేయని నాయకులను జైల్లో పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్ల పోలీసుల తీరు దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తమ నాయకుడికి మద్దతు తెలిపేందుకు టీడీపీ నేతలను కూడా బయటకు రానివ్వడం లేదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సింది పోలీసులు అని.. అసలు శాంతిభద్రతలకు, వైసీపీకి సంబంధం ఏంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో అరాచకాలు జరుగుతుంది వైసీపీ వల్లేనని ఫైర్ అయ్యారు.
వైసీపీ నాయకుల అక్రమాలు, దౌర్జన్యాలను ప్రశ్నించడం తప్పా అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. గతంలో విశాఖపట్టణంలోనూ జనసేన పట్ల ఇదే విధంగా వ్యవహరించారని పవన్ గుర్తుచేశారు. వైసీపీ నేతలు అక్రమాలు చేయవచ్చు, దోపిడీలు చేయవచ్చు.. జైళ్లలో మగ్గిపోవచ్చు.. విదేశాలకు వెళ్లవచ్చు అని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని.. ఆయన త్వరగా బయటకు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ వెల్లడించారు. మరోవైపు చంద్రబాబును కలిసి మద్దతు తెలిపేందుకు కాసేపట్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు పవన్ బయలుదేరనున్నారు.
శ్రీ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు రాజకీయ కక్ష సాధింపులో భాగం – జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. pic.twitter.com/2KE037VUjR
— JanaSena Party (@JanaSenaParty) September 9, 2023