టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆడ్మిట్ అయ్యారు. బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు ఇవాళ ఉదయం ఏఐజీ(AIG) ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు ఆసుపత్రిలో చేరాలని సూచించడంతో ఆయన అక్కడ చేరారు. ఒకటి లేదా రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండనున్నారని తెలుస్తోంది. డిశ్చార్జ్ అనంతరం ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రిలో చేరి కంటి ఆపరేషన్ చేయించుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా స్కిల్ డెవలెప్‌మెంట్ కేసు(Skill Development Case)లో అరెస్టై 52 రోజుల నుంచి రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో విడుదలైన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో 4 వారాల పాటు షరతులతో కూడి బెయిల్‌ను న్యాయస్థానం ఇచ్చింది. దీంతో జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు(Chandrababu) రాజమండ్రి నుండి ఉండవల్లిలోని తన నివాసానికి బుధవారం ఉదయం చేరుకున్నారు. అనంతరం బుధవారం సాయత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానశ్రయానికి చేరుకుని జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా బాబు అభిమానులు అడుగుడుగునా ఆయనకు నీరాజనం పలికారు.