2023 ప్రపంచకప్‌లో భారత్ అదరగొడుతోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో పరాజయం లేకుండా దూసుకుపోతుంది. ఇవాళ శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ దుమ్మురేపింది. మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 357 పరుగులతో భారీ స్కోర్ చేసింది. భారత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (92: 92 బంతుల్లో, 11 ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కింగ్ విరాట్ కోహ్లీ (88: 94 బంతుల్లో, 11 ఫోర్లు), మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (82: 56 బంతుల్లో, మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు)చివర్లో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే ముగ్గురు ఆటగాళ్లు తృటిలో సెంచరీలు మిస్ చేసుకున్నారు. లంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక ఐదు వికెట్లు పడగొట్టాడు.
358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత బౌలర్ల ధాటికి టపటపా వికెట్లు కోల్పోతున్నారు. కేవలం 15 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. దీంతో ఈ మ్యాచ్ గెలవడం లంకకు అసాధ్యమనే చెప్పాలి. టీమిండియా బౌలర్లలో హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లతో అదరగొట్టగా.. షమీ రెండు, బుమ్రా ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్ గెలవడం భారత్‌కు నల్లేరు మీద నడక కావడంతో సెమీస్ ఫైనల్ చేరుకోనుంది.