ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగిలింది. వేములవాడ నియోజకవర్గం కీలక నేత, కరీంనగర్ మాజీ జెడ్పీ ఛైర్‌పర్సన్ తుల ఉమ(Thula Uma) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. ఇప్పటికే సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జి. వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి వంటి కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.
‘బీజేపీలో చేరిన నాటి నుంచి పార్టీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశాను. పార్టీకి చేసిన సేవను గుర్తించి నన్ను వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేశారు. కానీ చివరి నిమిషంలో బీఫామ్ వేరే వాళ్ళకి ఇచ్చి నన్ను అవమానించారు. ఇది నా ఒక్కదానికి జరిగిన అవమానం కాదు. నా గొల్ల కురుమ జాతికి జరిగిన అన్యాయం. యావత్ తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కురుమల ఆగ్రహానికి మీ నిర్ణయం కారణమైంది. పార్టీకి ఎంతో నిబద్ధతతో పని చేసే కార్యకర్తలు ఉన్నారు. వాళ్లందరి ఉత్సాహాన్ని మీ తప్పుడు నిర్ణయాలతో నీరుగారుస్తున్నారు. నాతో పాటు ఎందరో బీసీ నాయకులకు మీరు అన్యాయం చేస్తున్నారు. అసలు బీఫామ్‌లే సరిగా ఇవ్వలేని మీరు బీసీ నినాదంతో ముందుకు పోతామని అనడం విడ్డూరంగా ఉంది.’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు.
వేములవాడ అసెంబ్లీ అభ్యర్థిగా తుల ఉమ(Thula Uma)ను మొదట ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో ఆమె స్థానంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్(Chennamaneni Vikas Rao) రావుకి టికెట్ కేటాయించారు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై కంటతడి పెట్టుకున్నారు.