నాంపల్లి(Nampally)లో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్(CM KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించడంతో పాటు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాద ఘటనపై ఆరా తీసిన ఆయన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు గవర్నర్ తమిళిసై కూడా ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఘటనకు గల కారణాలు తీసుకున్న చర్యలపై 2 రోజుల్లో తను నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
Nampally | అటు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్(KTR) ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఆయన, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav)తో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో ఆస్తి నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 9 మంది మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మరికొందరు అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలిపారు. వీరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మృతుల్లో నాలుగు రోజుల పసికందు సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహమ్మద్ ఆజమ్ (58), మహ్మద్ హసీబుర్ రెహమాన్(32), రెహనా సుల్తానా (50), తహూరా పర్హీన్ (35), టుబా(5), టరూబా (12), ఫైజా నమీన్(26), జకీర్ హుస్సేన్ (66), నికత్ సుల్తానా (55) మృతిచెందినట్లు ప్రకటించారు.