విశాఖపట్నం ఫిషింగ్(Visakha Harbour) హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. “విశాఖహార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 60కి పైగా బోట్లు దగ్ధమయ్యాయని తెలిసింది. బోట్లు కాలిపోయి నష్టపోయిన యజమానులకు, వారి కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున రూ.50వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించుకున్నాం. వచ్చే రెండు మూడు రోజుల్లో నేనే స్వయంగా వచ్చి బాధితులకు సాయం అందిస్తా. బోట్లు నష్టపోయిన వారి కుటుంబాలకు జనసేన అండగా ఉంటుంది” అని పేర్కొన్నారు.
కాగా ఆదివారం అర్దరాత్రి జరిగిన ప్రమాదంలో 60కి పైగా బోట్లు దగ్ధం కాగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాదంలో జీవనాధారమైన తమ బోట్లు దగ్ధం కావడంతో మత్స్యకారులు బోరున విలపించారు. ఒక్కో బోటు ఖరీదు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఉంటుందని రూ.కోట్లల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.