అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్(YS Jagan) బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం జగన్, సీబీఐ సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్‌ను సీబీఐ, ఈడీ కనీసం సవాలు చేయలేదని రఘురామ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా.. ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని ఆయన కోరారు.
ఇప్పటికే జగన్(YS Jagan) అక్రమాస్తుల కేసుల విచారణను తెలంగాణ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju) పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారణ ఎందుకు ఆలస్యమవుతుంది.. బదిలీ పిటిషన్‌ను ఎందుకు విచారించకూడదో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసిన ధర్మాసనం తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.