తెలంగాణ ఎన్నికల్లో(Telangana Elections) సంచలనంగా మారిన బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీషకు భద్రత కల్పించాలని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఆమెకు ఓ గన్‌మెన్ కేటాయించాలని.. ఆమె నిర్వహించే పబ్లిక్ మీటింగ్‌లకు భద్రత కల్పించాలని ఈసీ పాటు పోలీసులను ఆదేశించింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గుర్తింపు ఉన్న పార్టీలకు మాత్రమే భద్రత కల్పించడం సరికాదని.. ముప్పు ఉన్న ప్రతి అభ్యర్థికి సెక్యురిటీ ఇవ్వాలని సూచించింది. పోలీసులు కేవలం కార్లు చెక్ చేస్తామంటే కుదరదని చురకలు అంటించింది. అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్‌దే అని తెలిపింది.
రెండు రోజుల క్రితం బర్రెలక్క(Barrelakka) ఎన్నికల ప్రచారం చేస్తుండగా కొందరు ఆమె తమ్ముడిపై దాడి చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె కన్నీరు పెట్టుకున్న వీడియో వైరల్ కావడంతో శిరీషకు మద్దతు తెలిపే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ దాడి నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలని.. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు 2ప్లస్2 గన్‌మెన్లను కేటాయించాలని కోరుతూ పిటిషన్ వేశారు.