తెలంగాణ(Telangana)లో వాహనదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. పెండింగ్ చలాన్లపై రాయితీ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం, టూవీలర్ చలాన్లకు 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం, భారీ వాహనాలకు 50 శాతం రాయితీ ప్రకటించింది. రాయితీ మీద చలాన్లు కట్టేందుకు ఈనెల 26 నుంచి వచ్చే ఏడాది జనవరి 10 వరకు అవకాశం ఇచ్చింది. నిర్ణీత వ్యవధిలో చలానాలు చెల్లించేవారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టంచేసింది.
గతేడాది కూడా చలాన్లపై రాయితీ ప్రకటించడంతో వాహనదారుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. 2022 మార్చి 31 నాటికి 2.4 కోట్ల చలానాలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం.. ద్విచక్ర వాహనాలపై 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేవలం 45 రోజుల వ్యవధిలోనే రూ.300 కోట్ల వరకూ వసూలు వచ్చాయి. దాదాపు 65 శాతం మంది చలానాలు చెల్లించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా(Telangana) 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్లో(Pending Challans) ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.