బాపట్ల(Bapatla) టీడీపీ టికెట్ అంశం మరోసారి నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గం నుండి బరిలోకి దిగేది బాపట్ల టీడీపీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ(Vegesana Narendra Varma) అని అంతా భావించారు. ఈసారి తనకే ఎమ్మెల్యే టికెట్ అని వేగేశన కూడా ధీమాగా ఉన్నారు. టీడీపీ అధినేత జిల్లాల పర్యటనలో భాగంగా బాపట్ల వెళ్ళినప్పుడు నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతను అప్పగించారు. ఇక తానే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని ఫిక్స్ అయ్యారు వేగేశన. బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అయితే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన ఆశలపై నీళ్లు చల్లుతూ మరో సీనియర్ నేత రేసులోకి వచ్చారు. ఆ సీనియర్ నేత ఎవరో కాదు. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి(Mareddy Srinivasa Reddy). బాపట్ల టికెట్ విషయంలో ఆయన పేరు పార్టీ పెద్దల పరిశీలనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఎన్నికల్లో గెలుపోటముల విషయానికి వస్తే… ఆర్థిక బలమే కాదు అంగ బలం, సామాజిక బలం కూడా ముఖ్యపాత్ర వహిస్తాయి. వేగేశన నరేంద్ర వర్మ ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ.. మిగిలిన రెండు విషయాల్లో ఆయన వీక్ అనే చెప్పాలి. అంగబలం విషయానికి వస్తే.. నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయలోపం ఉందట. వేగేశన ప్రవర్తన స్థానిక నేతలకి నచ్చడం లేదట. ద్వితీయశ్రేణి నాయకత్వానికి ఆయనతో పొసగడం లేదట. తీసుకునే నిర్ణయాలు, వ్యవహరించే తీరు ఇబ్బందికరంగా మారాయని వాపోతున్నారట. ఇటీవల సొంత పార్టీ నేతలే వేగేశన హత్యాయత్నం చేశారంటూ పోలీసులని ఆశ్రయించడమే దీనికి తార్కాణంగా చెబుతున్నారు. నాయకుడు అందరితో కలిసి నడవాలి కానీ ఒంటెద్దు పోకడలు పోవడం నాయకత్వ లక్షణం అనిపించుకోదని వారంతా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో లోకల్ క్యాడర్ ఎన్నికల నాటికి వేగేశనతో కలిసి నడుస్తారా లేదా అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్.
బాపట్ల(Bapatla)లో వేగేశన సామాజిక వర్గం అయిన రాజుల ఓట్ల సంఖ్య కనీసం 5వేలు కూడా ఉండదు. ఇక్కడ గెలుపోటముల డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గాలు. ఎస్సీల ఓట్ల సంఖ్య దాదాపు 40 వేల ఓట్లు ఉండగా, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు సుమారు 35 వేలు. గత ఎన్నికల్లో ఈ రెండు కమ్యూనిటీలకు చెందిన ఓట్లు ఎక్కువ శాతం వైసీపీ(YCP)కి వెళ్ళాయి. అయితే ఈసారి మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గాల నేతలు గళమెత్తారు. తమ కమ్యూనిటీల అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇవ్వడం లేదని, వైసీపీ ప్రభుత్వంలో తమకు నష్టం జరిగిందని బహిరంగంగానే తిరుగుబాటు వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుత ఎమ్మెల్యే కోన రఘుపతి(Kona Raghupathi)కి తిరిగి సీటిస్తే పిట్టలవానిపాలెం మండల రెడ్డి సామాజిక వర్గం, దళితులు వైసీపీకి మద్దతు పలకబోరని ఇటీవల మండల జడ్పీటీ సభ్యులు గోవతోటి సురేఖ అన్నారు. ఎమ్మెల్యే కోన వ్యతిరేక వైసీపీ వర్గీయులతో సమావేశం నిర్వహించిన ఆమె దళితుల పట్ల కోనకు ద్వేషం మాత్రమే ఉందని, ఎన్నోసార్లు మండలం అభివృద్ధి గురించి అడిగినా మమ్మల్ని అవమానించారే తప్ప ఎటువంటి నిధులు కేటాయించలేదని తెలిపారు. పార్టీలో తమకు ఎటువంటి గుర్తింపు, గౌరవం, దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికి టిక్కెట్టు ఇస్తే తప్పకుండా మేము పార్టీలో పనిచేస్తామన్నారు.
మరోవైపు బాపట్ల అసెంబ్లీ సీటును రెడ్డి సామాజికవర్గానికి కేటాయించాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. బాపట్లలో సంఘీయులు, వైసీపీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏ పార్టీ అయితే రెడ్లకు సీటు కేటాయిస్తుందో ఆ పార్టీకే తమ మద్దతు ఉంటుందన్నారు. బాపట్ల నియోజకవర్గంలో 36 వేల మందికి పైగా రెడ్డి ఓటర్లు ఉన్నారు కావున ఓరుగంటి రెడ్లకు కేటాయించాలన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళుతామన్నారు. ఒకవేళ తెలుగుదేశం రెడ్లకు సీటు కేటాయిస్తే వారికే మద్దతు ఉంటుందన్నారు.
బాపట్లలో కోన కి టికెట్ వద్దని, రెడ్డి కమ్యూనిటీకి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ బలంగా పెరుగుతున్న నేపథ్యంలో జగన్ అభ్యర్ధిని మార్చే అవకాశం కూడా ఉంది. రెడ్డి కాండిడేట్ నే బరిలో దింపవచ్చు. అలాంటి తరుణంలో వేగేశనకి టికెట్ ఇస్తే గట్టి ఎదురుదెబ్బ తగలోచ్చు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే వేగేశనకి కాకుండా.. రెడ్డి కమ్యూనిటీకి చెందిన నేతకి టికెట్ ఇస్తే బాపట్ల అసెంబ్లీకే కాకుండా పార్లమెంటు పరిధిలో కూడా లాభం చేకూరుతుందని స్థానిక టీడీపి(TDP) నేతలు భావిస్తున్నారు. ఒకవేళ టీడీపీ రెడ్డి అభ్యర్థికి టికెట్ కేటాయిస్తే వైసీపీ పై ఉన్న వ్యతిరేకత కారణంగా.. జగన్ రెడ్డి(YS Jagan)కి టికెట్ ఇచ్చినా ఆ సామాజికవర్గం ఓటర్లు టీడీపీ వైపే మొగ్గు చూపుతారని బలంగా చెబుతున్నారు.
మరోవైపు 2019 ఎన్నికల్లో బాపట్ల(Bapatla)లో టీడీపీ ఓటమికి కారణాలలో వేగేశన కూడా ఒకరని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో వేగేశన చేసిన తప్పిదం ఎఫెక్ట్ రానున్న ఎన్నికలపై పడే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పోయినసారి బాపట్ల నుండి కాపు సామాజికవర్గానికి చెందిన అన్నం సతీష్ ప్రభాకర్(Annam Satish Prabhakar) టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయనని ఓడించేందుకు వైసీపీ అభ్యర్థి కోనా రఘుపతికి వేగేశన లోపాయికారికంగా ఆర్థిక సహాయం చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈసారి టీడీపీ(TDP) జనసేన(Janasena) పొత్తు ఉన్నప్పటికీ.. అన్నం సతీష్ ఓటమికి కారణమైన వేగేశనకు మద్దతు ఇవ్వకూడదని స్థానిక కాపు నేతలు అంతర్గతంగా ఫిక్స్ అయినట్టు టాక్. ఈ అంశాలన్నీ పెద్దల దృష్టికి కూడా కేడర్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బాపట్ల(Bapatla) టీడీపీ టికెట్ రేసులోకి మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎంటర్ అయినట్టు సమాచారం. వేగేశన వ్యవహారశైలి పార్టీ పెద్దల దృష్టిలో ఉన్న నేపథ్యంలో.. శ్రీనివాస్ రెడ్డి విషయంపై అధిష్టానం సానుకూలంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల టాక్. ఇక శ్రీనివాస్ రెడ్డి విషయానికి వస్తే.. ఆయన చిరుప్రాయం, విద్యాభ్యాసం బాపట్ల లోని కాకుమాను మండలంలోనే గడిచింది. విద్యాభ్యాసం నుండి కమ్యూనిస్టు భావజాలంతో పోరాటాలు చేసి క్రింద స్థాయి నాయకుడి నుండి జడ్పీటీసీగా అక్కడి నుంచి రాష్ట్ర రైతు అధ్యక్షులుగా ఎదిగారు. రైతు అధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుండి.. రైతులకు మద్దతుగా ప్రభుత్వంపై అనేక ఆందోళనలు చేపట్టారు. కార్యకర్తల నుండి అధిష్టానం పెద్దల వరకు తలలో నాలుకగా మారారు. దీంతో ఆయనకి టికెట్ ఇస్తే ఎన్నో ఏళ్లుగా బాపట్లలో ఓటమి చవిచూస్తోన్న టీడీపీకి ఈసారైనా విజయం సొంతం అవుతుందని స్థానిక నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.