అయోధ్య(Ayodhya) రామమందిరంలో ప్రతిష్టించనున్న ‘రామ్ లల్లా'(Ram Lalla) విగ్రహాన్ని రామజన్మ భూమి ట్రస్ట్ సభ్యులు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి(Prahlad Joshi) అధికారికంగా ప్రకటించారు. కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్(Arun Yogiraj) చెక్కిన బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నట్లు తెలిపారు. ఈ విగ్రహాన్ని ఓటింగ్ ద్వారా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన మరో శిల్పి గణేశ్ భట్(Ganesh Bhatt), రాజస్థాన్‌కు చెందిన సత్యనారాయణ పాండే(Satyanarayan Pandey)లు తీర్చిదిద్దిన రాముని విగ్రహాలు కూడా పోటీలో నిలవగా అరుణ్ చెక్కిన విగ్రహం వైపే నిర్వాహకులు మొగ్గు చూపారు.
Arun Yogiraj (37) ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ కుమారుడు. ఎంబీఏ పూర్తి చేసిన అరుణ్ 2008 నుంచి కుటుంబం వారసత్వంగా నిర్వహిస్తున్న శిల్పకళా వృత్తిలోకి వచ్చారు. ఇప్పటివరకు వెయ్యికి పైగా విభిన్న విగ్రహాలను చెక్కారు. కేదార్‌నాథ్ ఆలయంలో ఆదిశంకరాచార్య విగ్రహంతో పాటు ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా తీర్చిదిద్దారు. అయితే తాను చెక్కిన ‘రామ్ లల్లా’ విగ్రహం ప్రాణప్రతిష్టకు ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేశారు.
‘రామ్ లల్లా’ అంటే రాముడి చిన్ననాటి విగ్రహం. రాముడు బాలుడిగా ఉన్నప్పుడు ఎలా ఉండేవారు అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహం పొడవు 51 అంగుళాలు, 8 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు ఉంటుంది. జనవరి 22న ప్రధాని మోదీ(PM Modi) సమక్షంలో ఈ విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయనున్నారు.