వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్ రెండున్నరేళ్లు సీఎంగా చేయాలని మాజీ ఎంపీ హరిరామ జోగయ్య(Hari Ramajogaiah) బహిరంగ లేఖ రాశారు. రెండు రోజుల క్రితం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌ను జోగయ్య వ్యక్తిగతంగా కలిశారు. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ అంశాలు, కూటమిగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. తాజాగా ఈ భేటీ యొక్క సారాంశాన్ని తెలియజేస్తూ ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
“ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)తో సమావేశమయ్యాను. జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తుల అంశంపై సుదీర్ఘంగా చర్చించాను. మూడు పార్టీలు కలిస్తే గెలుపు మరింత సులువు అవుతుందని చెప్పాను. బీజేపీ కూడా టీడీపీ-జనసేనతో కలిసి వచ్చే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు.
రాష్ట్రంలో జనసేన 40 నుంచి 60 స్థానాలు బలంగా ఉన్నట్లు పవన్ కల్యాణ్‌కు సూచించాను. 40 సీట్లకు తగ్గకుండా పోటీ చేయాలని చెప్పాను. అధికారంలో కూడా భాగస్వామ్యం కావాలని తెలిపాను. జనసేన కార్యకర్తలకు స్పష్టమైన హామీ రావాలని అడిగాను. నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెంలలో ఏదో ఒకచోట పవన్ పోటీ చేయాలి అని చెప్పాను.
రెండున్నర సంవత్సరాలైనా పవన్ కల్యాణ్‌ని ముఖ్యమంత్రిగా చూడాలని జనసైనికులు భావిస్తున్నారు. పవర్‌షేరింగ్ అంశం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. సీఎం ప్రతిపాదన అంశం ప్రజల్లోకి వెళ్తే టీడీపీ, జనసేన మధ్య ఓటు బదిలీ అవుతుందని వెల్లడించాను. ఆయన కూడా నా అభిప్రాయాలతో ఏకీభవించారు” అని ఆయన(Hari Ramajogaiah) లేఖలో పేర్కొన్నారు.