Narayana Swamy – YCP | వైసీపీ నాలుగో జాబితా విడుదల చేసిన తర్వాత పార్టీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరుకున్నాయి. మొత్తం తొమ్మిది మందితో కూడిన జాబితాలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు లేకపోవడంతో వారంతా షాకయ్యారు. దీంతో హై కమాండ్ పై గుర్రుగా ఉన్నారు. లిస్ట్ లో పేర్లు లేకపోవడంతో కనిగిరి, తిరువూరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కనిగిరిలో టికెట్ కోల్పోయిన మధుసూదన్ రావు తన అనుచరులతో భేటీ అయ్యారు. ఇంకోవైపు మండల అధ్యక్షులు, పలువురు నేతలు పార్టీకి రిజైన్ చేశారు. మరోవైపు తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధికి సైతం ఆశాభంగం కలిగింది. జాబితాలో ఆయనకి చోటు దక్కలేదు. మూడు రోజుల క్రితం పార్టీలో చేరిన స్వామిదాస్ కి ఆ టికెట్ ను కేటాయించింది.
హోమ్ మినిస్టర్ తానేటి వనితను కొవ్వూరు నుంచి గోపాలపురం కి మార్చగా.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి(Narayana Swamy)ని చిత్తూరు ఎంపీగా కేటాయించారు. దీంతో ఆయన అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. గతంలోనే నారాయణస్వామి తనకి ఎంపీ టికెట్ వద్దని జగన్ ని కలిసి రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ ఆయనకి ఎంపీ టికెట్ కేటాయించడంపై మండిపడుతున్నారు. ఆయన అనుచరులు అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, ఎంపీ టికెట్ వద్దని పట్టుబట్టారు. ఎంపీ టికెట్ వద్దని, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినా జగన్ పట్టించుకోకపోవడంతో నారాయణస్వామి తీవ్ర నిరాశకు గురయ్యారు. అధిష్టానం నిర్ణయం మార్చుకోకపోతే రాజీనామా చేయాలని ఆలోచనలో కూడా ఉన్నట్లు ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు.