అయోధ్యలోని రామ మందిరం(Ayodhya Ram Mandir)లో బాల రాముని ప్రాణ ప్రతిష్టకు సుముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో సీతమ్మ పుట్టినిల్లు నేపాల్ లో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. రామయ్యపై తమ భక్తిని చాటేందుకు జనక్ పూర్ ధామ్(Janakpur Dham) లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. జనక్ పూర్ లోని జానకీ మాత ఆలయాన్ని రంగు రంగుల విద్యుద్దీపాలతో వైభవోపేతంగా అలంకరించారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
జనక్ పూర్ జానకీ దేవి(Janaki Devi) ఆలయం సీతారామ నామ స్మరణతో మార్మోగుతోంది. అయోధ్య లో రాముని ప్రతిష్ట జరిగే రోజు సీతమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అక్కడి పూజారులు చెబుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ కొనసాగుతాయని తెలిపారు. వేడుకల్లో భాగంగా రాముని చిత్రాలను సింధూరం, పువ్వులతో రూపొందించనున్నారు. అలాగే జనక్ పూర్(Janakpur Dham) లోని ప్రతి ఒక్కరి ఇంట్లో దీపాలు వెలిగించనున్నారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం తమకి ఎంతో సంతోషాన్ని కలిగించిందని అక్కడివారు చెబుతున్నారు.