మంత్రి రోజా(Minister Roja)పై పుత్తూరు వైసీపీ కౌన్సిలర్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. 17వ వార్డ్ కౌన్సిలర్ భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం రూ.70 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. రోజా సోదరుడు కుమారస్వామిరెడ్డి అనుచరుడు సత్యకు 3 విడతల్లో రూ.40 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఒకసారి రూ.20 లక్షలు.. మరోసారి రూ.7 లక్షలు, ఇంకోసారి రూ.3 లక్షలు, మరో రూ.10లక్షలు ఇచ్చినట్లు వివరించారు. డబ్బులు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయని కొన్ని వీడియోలను ప్రదర్శించారు.
రెండో విడతలో ఛైర్మన్ పదవి ఇస్తామన్నారని.. ఇప్పుడు అడిగితే ఎన్నికల తర్వాత పదవి ఇస్తామని మాయ మాటలు చెబుతున్నారని వాపోయారు. ఎన్నికల తర్వాత పదవి అవసరం లేదని.. డబ్బుల్ని తిరిగి ఇవ్వాలని అడిగితే ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత మహిళను అయిన తనకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్(CM Jagan)కు విజ్ఞప్తి చేశారు. కౌన్సిలర్ చేసిన ఆరోపణలపై మంత్రి రోజా(Minister Roja).. ఆమె సోదరుడు కుమారస్వామి రెడ్డి కానీ స్పందించలేదు. ఏకంగా మంత్రిపైనే వైసీపీ కౌన్సిలర్ అవినీతి ఆరోపణలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.