రేపటి నుంచి హైదరాబాద్‌లో భారత్, ఇంగ్లాండ్(India vs England) పురుషుల జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇందుకు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదిక కానుంది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత నగరంలో టెస్ట్ మ్యాచ్ జరగనుండటంతో మ్యాచ్ చూసేందుకు అభిమానులు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించింది.
India vs England | మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు ఈ బస్సులు నడుస్తాయని ప్రకటించింది. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు పలు ప్రాంతాల నుంచి బస్సులు ప్రారంభమవుతాయని ఆర్టీసీ(TSRTC) ఎండీ సజ్జనార్ తెలిపారు. తిరిగి రాత్రి 7 గంటల వరకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలుదేరనున్నాయని పేర్కొన్నారు. క్రికెట్ అభిమానులు ప్రత్యేక బస్సుల సర్వీస్‌ను వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు అభిమానులు తొలి రోజు ఉచితంగా మ్యా్చ్ చూసేందుకు హెచ్‌సీఏ అనుమతి ఇచ్చింది.