బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సంచలన ట్వీట్ చేశారు. ‘పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారు’ అంటూ సుమతి శతకంలో బద్దెన రాసిన ‘కనకపు సింహాసనమున శునకమును గూర్చుండబెట్టిన శుభ లగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణ మేలమాను? వినురా సుమతీ’ అనే పద్యాన్ని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని ఉద్దేశించే ఈ ట్వీట్ పెట్టారని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు.
తెలంగాణ భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇదే పద్యం చెప్పారు. కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చినా అసహనంతోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ తామే అధికారంలో ఉన్నట్లుగా.. కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నట్లుగా వారు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేసే వరకూ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటామని కేటీఆర్(KTR) స్పష్టం చేశారు.