ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) YSR పార్టీకి కొత్త అర్థం చెప్పారు. Y అంటే వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy), S అంటే సాయిరెడ్డి(Vijayasai Reddy), ఆర్ అంటే R రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అని సెటైర్లు వేశారు. ఆ పార్టీలో అసలు వైఎస్సారే లేరని.. అది జగన్ రెడ్డి నియంత పార్టీ అని విమర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో షర్మిల మాట్లాడుతూ వైసీపీ నేతలు తనపై ముప్పేట దాడి చేస్తున్నారని.. మీరు ఎన్ని రకాలుగా తన మీద దాడులు చేసినా భయపడే ప్రసక్తే లేదని.. తాను వైఎస్సార్ బిడ్డనని తెలిపారు.
అంతకుముందు మద్దిపాడులోని గుండ్లకమ్మ ప్రాజెక్టును ఆమె పరిశీలించారు. వైయస్ వారసులమని చెప్పుకునే నేతలు గేట్లు ఊడిపోయినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. లక్ష ఎకరాలకు సాగునీరు, 12 మండలాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ గుండ్లకమ్మ అని.. అలాంటి ప్రాజెక్టు గేట్లు ఊడిపోతుంటే నీటిపారుదల శాఖ మంత్రి మాత్రం సంక్రాంతి డ్యాన్స్‌లు వేస్తున్నారని సెటైర్లు వేశారు. వైఎస్సార్ పాలనకు జగనన్న పాలనకు నక్కకు.. నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు. యుద్ధానికి తాను సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం, ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని షర్మిల(YS Sharmila) ప్రజలకు పిలుపునిచ్చారు.