నాయకుడంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ఏ కష్టమొచ్చినా నేనున్నాంటూ ముందుకు రావాలి. పది మందికి మంచి చేయడానికి ఎంత దూరమైనా వెళ్లాలి. ఈ క్రమంలో తనకు నష్టం వచ్చినా వెనకడుగు వేయకూడదు. ఇప్పుడు ఇదే చేసి చూపించారు కామార్డెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి(MLA Katipally). ఎమ్మెల్యేగా గెలిచాక పట్టణంలో రోడ్ల విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడి విస్తరణ పనులు చేయాలని సూచించారు. దీంతో అధికారులు విస్తరణ పనులు మొదలుపెట్టారు.
అయితే రోడ్లు విస్తరణ చేయాలంటే ఎమ్మెల్యే ఇల్లు అడ్డుగా ఉందని గుర్తించారు. ఈ విషయాన్ని ఆయన దృష్టికి అధికారులు తీసుకెళ్లగా అందుకు అంగీకరించారు. వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేసి మరో చోటుకు మారారు. దీంతో అధికారులు ఎమ్మెల్యే ఇంటిని కూల్చి విస్తరణ కార్యక్రమం మొదలుపెట్టారు. దీంతో ప్రజల బాగు కోసం తన ఇంటినే కూల్చివేయడానికి సిద్ధపడిన వెంటకరమణారెడ్డి తోటి ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. దీంతో అందరూ ఆయన నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లపై వెంకట రమణారెడ్డి(MLA katipally) సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇద్దరు సీఎం అభ్యర్థులు పోటీ చేసినా అనూహ్యంగా బీజేపీ తరపున గెలిచి చరిత్ర సృష్టించారు. దీంతో ఆయన పేరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మార్మోగింది.