కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి(Killi Krupa Rani) వైసీపీకి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా లేఖను సీఎం జగన్కు పంపించారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా ఎందుకు నియమించారో.. ఎందుకు తొలగించారో కూడా తెలియని పరిస్థితి ఉందని వాపోయారు. పార్టీలో చేరేటప్పుడు కేబినెట్ స్థాయి పదవి, ఎంపీ టికెట్ ఇస్తారని హామీ ఇచ్చారని కానీ ఇప్పుడు మోసం చేశారని తెలిపారు. పార్టీలో తనకు అన్యాయం, అవమానం జరిగిందని విమర్శించారు. రాజకీయాల్లో పదవుల కంటే గౌరవమే ముఖ్యమని లేఖలో పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయాలని ఆమె భావించారు. అయితే ఆమెకు టికెట్ రాలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆమె వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేస్తారని… అలాగే అమె కుమారుడు విక్రాంత్ టెక్కలి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. కాగా 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీకాకుళం ఎంపీగా పోటీచేసి కృపారాణి(Killi Krupa Rani) గెలుపొందారు. అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర సహాయమంత్రిగా విధులు నిర్వర్తించారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.