RRR మూవీతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్(Ram Charan) మరో ఖ్యాతిని అందుకున్నారు. ప్రముఖ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ బిరుదు అందుకోబోతున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి చెందిన వేల్స్ యూనివర్సిటీ(Vels University) చరణ్‌కు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. దీంతో ఏప్రిల్ 13న ఈ యూనివర్సిటీలో జరగనున్న స్నాతకోత్సవ కార్యక్రమానికి చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా చరణ్ ఈ డాక్టరేట్ అందుకుంటారని సమాచారం. కళారంగానికి చరణ్ చేసిన సేవలకు గాను ఈ డాక్టరేట్ ప్రదానం చేయబోతున్నట్టు యూనివర్సిటీ వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో పలువురు తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. డాక్టరేట్ అందుకోనుండటంతో చెర్రీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడికి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం చెర్రీ(Ram Charan) శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీతో పాటు బుచ్చిబాబు సాన దర్శకత్వంలోని ఓ సినిమాలోనూ హీరోగా నటిస్తున్నాడు.