గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు లొంగకుండా, బెదిరింపులకు భయపడకుండా ఆమె పోరాడిన తీరు అభనందనీయం. అందుకే ప్రముఖులు కూడా బర్రెలక్కకు పరోక్షంగా తమ మద్దతు తెలియజేశారు. అయితే ఆ ఎన్నికల్లో 5,754 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచినా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఎన్నికల్లో ఓడిపోయినా సరే నిరుద్యోగుల తరపున తన పోరాటం ఆపనంటూ బర్రెలక్క ప్రకటించారు.
అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని వెల్లడించారు. ముందు చెప్పినట్లుగానే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తన(Barrelakka) భర్త, కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి మల్లు రవి.. బీజేపీ నుంచి పోతుగంటి భరత్ బరిలో ఉన్నారు.