పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీకి గుడ్‌బై చెప్పగా.. తాజాగా శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు(Gutta Amit) కూడా కాంగ్రెస్‌లో చేరిపోయారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీప్‌దాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు నల్గొండకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలోనే గుత్తా సుఖేందర్ కూడా హస్తం తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి అధికారం కోల్పోవడంతో నల్లగొండ జిల్లాలో ఆ పార్టీ ప్రభావం తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన గుత్తా సుఖేందర్ కుమారుడు అమిత్ రెడ్డి(Gutta Amit) యూ టర్న్ తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని కేసీఆర్‌కు చెప్పేశారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వైఖరిపై గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్.. నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వటం మానేశారని విమర్శించారు. బీఎస్పీ మాదిరిగానే బీఆర్ఎస్ తయారైందంటూ మండిపడ్డారు. అప్పటి నుంచి గుత్తా ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో చేరనుందనే ప్రచారం జరిగ్గా.. తాజాగా ఆయన కుమారుడు హస్తం గూటికి చేరిపోయారు.
Read Also: వైసీపీ మేనిఫెస్టో కొత్త హామీలు ఇవే..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat