తెలంగాణలో వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ(Graduate MLC) ఉపఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి మే 9వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. మే 13 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఇక ఈనెల 27న పోలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుండగా.. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఉపఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్‌ను ఈసీ నియమించింది.
Graduate MLC |కాగా గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా గెలిచారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ నియోజకవర్గంలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో పురుషులు 2,87,007, మహిళలు 1,74,794, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బరిలో దిగారు.