హ్యాకింగ్, సైబర్ మోసాలు, వైరస్ దాడుల ఘటనలు రోజురోజుకు అధికమవుతున్న క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని మోదీ(PM Modi) కీలక సూచన చేశారు. డిజిటల్ ప్రపంచంలో జీవనం ఎంత సులభతరం అవుతుందో మనం కూడా అంతే అప్రమత్తంగా ఉండాలన్నారు. హ్యాకింగ్, సైబర్ దాడులు, వైరస్ దాడుల నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలని, అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా తమ పని పూర్తయిన తర్వాత తమతమ సిస్టమ్స్‌ను లాగౌట్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
సీనియర్ బ్యూరోక్రాట్లతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ ఈ అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రోజూ పని పూర్తికాగానే మీ సిస్టమ్‌లను లాగౌట్ చేస్తున్నారా? నేను చేస్తున్నాను. సైబర్ భద్రత విషయంలో సిస్టమ్ లాగౌట్ చేయడం చాలా ముఖ్యం. ప్రతి ఆఫీసులో కూడా పని వేళలు పూర్తయిన తర్వాత అన్ని సిస్టమ్‌లు లాగౌట్ అయ్యాయా లేదా అనేది గమనించే పనిని ఒకరికి అప్పగించాలి. సిస్టమ్‌లను అలాగే లాగిన్ చేసి ఉంచడం వల్ల సైబర్ దాడులు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది’’ అని ప్రధాని మోదీ(PM Modi) వివరించారు.