ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య మాట యుద్ధం నడుస్తోంది. వినుకొండలో యువకుడి హత్య జరిగిన నేపథ్యంలో ఇది మరింత ముదిరింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం వైఎస్ జగన్(Jagan).. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి చేస్తారని అధికారం కట్టబెడితే వ్యక్తిగత కక్ష్యలను తీర్చుకోవడానికి అధికారాన్ని వినియోగిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యలకు తాజాగా మంత్రి నారా లోకేష్(Nara Lokesh) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హింస, అరాచకం, అవినీతి, విధ్వంసం గురించి జగన్ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లే ఉందంటూ చురకలంటించారు. బాధితులనే బాధ్యులను చేసిన ఉగ్రవాద ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టి నెల రోజులే గడిచిందని, ఐదేళ్ల పాటు భయంతో చీకటి బతుకులను చూసిన ప్రజలు ఎన్నికల్లో ఆ ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా చేశారంటూ ఘాటుగా స్పందించారు.
‘‘రాష్ట్రంలో ఇంకా అక్కడక్కడ ఉన్న ఆ అరాచకపు ఆనవాళ్లను కూటమి ప్రభుత్వం కూకటివేళ్లతో పెకలిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి రాష్ట్రంలో గత ఐదేళ్లలో జరిగిన ఎన్నో అరాచకాలపై నుంచి తెర తొలగించింది. ప్రజల తీర్పుతో రాష్ట్రంలో ఉనికిని సైతం కోల్పోయిన జగన్ ఇప్పుడు ఫేక్ ప్రచారాలతో రాష్ట్రంలో అబద్దపు పునాదులను మళ్ళీ వేయాలని ప్రయత్నిస్తున్నారు. శవరాజకీయాలు చేసే మీ నీచ సంస్కతికి ప్రజలు ఇచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలు అని ఇంకా అవగతం చేసుకోకపోతే ఎలా’’ అని ఎద్దేవా చేశారు.
‘‘నేరాలు చేసి వాటిని పక్కనోళ్లపై నెట్టేసే మీ కపట నాటకాలకు కాలం చెల్లింది. ప్రజల రక్షణకు కూటమి కట్టుబడి ఉంది. ఎవరికి అన్యాయం జరిగినా.. అది ఎవరి వల్ల జరిగినా ఉపేక్షించేది. ఏ నిందితుడినీ వదిలేది’’ అని స్పష్టం చేశారు నారా లోకేష్(Nara Lokesh).