కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్(Valmiki Scam)లో తెలంగాణ నేతలు, వ్యాపారవేత్తల పాత్ర కూడా ఉందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక ఎస్టీ కార్పొరేషన్ నుంచి రూ.45 కోట్లు బదిలీ అయ్యాయని, ఎన్నికల వేల భారీ మొత్తంలో నగదు డ్రా చేసిన బార్లు, బంగారు దాకాణాల నిర్వాహకులు ఎవరు? వారికి కాంగ్రెస్‌కు మధ్య సంబంధం ఏంటి? వారు ఎన్నికల సమయంలో ఒక్కసారిగా అంత మొత్తం ఎందుకు విత్‌డ్రా చేయాల్సి వచ్చింది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వీటికి కాంగ్రెస్ సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు.
‘‘హైదరాబాద్‌లో పలు తొమ్మిది మందికి చెందిన బ్యాంకు ఖాతాలకు రూ.45 కోట్లు బదిలీ అయ్యాయి. వాల్మీకి స్కామ్(Valmiki Scam)కు సంబంధించి తెలంగాణలో సిట్, సీఐడీ, ఈడీ సోదాలు జరిగాయి. దర్యాప్తు సంస్థల సోదాలకు సంబంధించి ఏమాత్రం సమాచారం బయటకు పొక్కకుండా అడ్డుకున్నారు. రూ.90 కోట్ల అవినీతి జరిగిందంటూ కర్ణాటక(Karnataka) అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్వయంగా వెల్లడించారు. అదే సమయంలో సిద్దరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా పేకమేడలా కూలుతుందని కర్ణాటక మంత్రి సతీష్ అన్నారు? ఆయన మాటల వెనక ఆంతర్యం ఏంటి? ఇన్ని అంశాలు వెలుగు చూస్తున్నా ఈడీ మాత్రం మౌనం ఎందుకు పాటిస్తుంది? తెలంగాణలో కాంగ్రెస్‌ను రక్షిస్తున్నది ఎవరు? కాంగ్రెస్‌కు గాడ్‌ఫాదర్‌లా ఉన్నది ఎవరు?’’ అని ప్రశ్నలు గుప్పించారు.