నందిగామ(Nandigama)లో ఇద్దరు యువకుల మధ్య పందెం ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. పందెం కాయడం చాలా మందికి సరదా. ఉబుసుపోక కూడా పిచ్చిపిచ్చి పందేలు కాస్తుంటారు. అటువంటి పందెమే ఒకటి నందిగామలో ఒక యువకుడి ప్రాణాలు తీసింది. నందిగామ పెద్ద బ్రిడ్జిపై నుంచి కింద ఉన్న వాగులోకి దూకి ముందు ఎవరు ఒడ్డుకు చేరుకుంటారు అన్న విషయంపై గోపీచంద్, రోశయ్య అనే యువకులిద్దరూ పందెం కాసుకున్నారు. ఓడిపోయిన వాళ్లు గెలిచిన వారికి రూ.2 వేలు ఇవ్వాలని పందేన్ని ఖరారు చేసుకున్నారు. అనుకున్న పందెం ప్రకారం బ్రిడ్జ్‌పై నుంచి వాగులోకి ఇద్దరూ దూకారు. నిమిషాల్లోనే రోశయ్య ఒడ్డుకు చేరుకున్నాడు. గోపీచంద్ మాత్రం ఎంత సేపటికి రాలేదు. కనీసం వాగులో కూడా ఎక్కడా కనపించట్లేదు. దీంతో కంగారు పడిన రోశయ్య.. మొత్తం విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.
Nandigama | హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు వాగంతా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ గోపీచంద్ ఆచూకీ లభించలేదు. వీరిద్దరూ మద్యం మత్తులో ఈ పందెం కాసినట్లు పోలీసులు గుర్తించారు. రోశయ్యను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే గోపీచంద్ గల్లంతైన విషయం తెలిసి అతడు కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.