హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ప్రతి హిందువుకు క్షమాపణలు చెప్పాలని వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) వ్యాఖ్యానించారు. వైసీపీ భ్రష్టు పట్టించాలన్న ఉద్దేశంతోనే టీడీపీ తమపై ఇంతటి అపవాదు వేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని ప్రకటించారు. శ్రీవారి లడ్డూలో అడిబుల్ ఆయిల్ ఉంది అని జూలై 17న టీటీడీ ఈఓ శ్యామల రావు స్పష్టం చెప్పారు. కానీ కేవలం వైసీపీని దెబ్బతీయాలని, వైసీపీ ప్రతిష్టను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఈరోజున తప్పుడు ప్రచారం మొదలుపెట్టారని, తన ప్రచారానికి బలం చేకూర్చడానికి ఎన్‌డీడీబీ ఫేక్ రిపోర్ట్‌ను కూడా ప్రచారం చేస్తున్నారని అన్నారాయన.
‘‘ఈ ఆరోపణలపై అధికారులు కాకుండా స్వయంగా చంద్రబాబే ఎందుకు మాట్లాడుతున్నారు? చంద్రబాబు సర్కార్‌కు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మాపై వేసిన అపవాదుపై విచారణకు సిద్ధం. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. అవసరమైతే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలి. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయాలని చంద్రబాబు చేసిన ప్రచారం బెడిసి కొట్టింది. టీడీపీ నిజమైన విష స్వరూపం బట్టబయలైంది. ఆయన వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి’’ అని భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) డిమాండ్ చేశారు.