ఈనెల ప్రారంభంలో కురిసిన భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. ఏపీలో విజయవాడ సహా పలు ప్రాంతాలు వారాల తరబడి వరద నీటిలో మునిగిపోయాయి. వరద బాధితులకు సహాయం అందించడానికి ప్రభుత్వం అహర్నిశలు శ్రమించింది. ఈ వరదల కారణంగా వేల మంది ప్రభావితమయ్యారు. ఎంతో మంది విలువైన వస్తువులను కూడా కోల్పోయారు. వారికి సహాయం అందించడానికి అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని సీఎం చంద్రబాబు గతంలోనే పిలుపునిచ్చారు. ఎవరికి తోచినంత వారు సీఎం సహాయనిధికి విరాళంగా ఇవ్వొచ్చని చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ వరద బాధితులకు అండగా నిలవడానికి మంచు మోహన్‌బాబు(Manchu Mohan Babu) కుటుంబం ముందుకు వచ్చింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడును మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఏపీ వరద బాధితుల కోసం సీఎం సమాయనిధికి రూ.25 లక్షల విరాళం అందించారు. ఇదే అంశాన్ని తెలుపుతూ మంచు విష్ణు తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడుతో జరిగిన సమావేశంలో తన తాజాగా సినిమా ‘కన్నప్ప’ గురించి చర్చించానని మంచు విష్ణు చెప్పారు.
‘‘ఆంధ్ర సీఎం చంద్రబాబును ఈరోజు కలిశాం. ఏపీ వరద బాధితులకు సహాయం అందించడం కోసం సీఎంకు రూ.25 లక్షల చెక్కును అందించాం. అంతేకాకుండా కన్నప్ప సినిమా సహా అనే విషయాల గురించి సీఎం చంద్రబాబుతో చర్చించాం. నా ఆర్ట్ వర్క్‌పై చంద్రబాబు ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాను’’ అని విష్ణ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.