కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఈరోజు కేరళ వయనాడ్ లోక్‌సభ స్థానానికి తన నామినేషన్ దాఖలు చేశారు. తల్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు వెంట రాగా ఆమె తన నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా వయనాడ్‌లో ఇటీవల సంభవించిన ప్రకతి వైపతరిత్యం గురించి ఆమె మాట్లాడారు. ‘‘ఆ వినాశనాన్ని నా కళ్లతో చూశాను. కుటుంబాలను కోల్పోయిన పిల్లల్ని చూశాను. సర్వం కోల్పోయిన వారినీ చూశాను. ఇంత కష్టంలో కూడా ఒకరికొకరు సహకరించుకోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి వారిలో భాగం కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’’ అని అన్నారు.
ఇది నాకందిన గౌరవం: Priyanka Gandhi
‘‘తొలిసారి నా 17 ఏళ్ల వయసులో నా తండ్రి కోసం ఎన్నికల్లో ప్రచారం చేశాను. 35 ఏళ్ల నా రాజకీయ జీవితంలో నా తల్లి, సోదరుడు, పార్టీలోని కీలక, సీనియర్ నేతల కోసం కూడా ప్రచారం చేశాను. ఈ ప్రచారాల్లో ప్రజల్లో తిరిగి వారి జీవితాల గురించి తెలుసుకున్నాను. వారి కష్టాలు చూశాను. సమస్యలు విన్నాను. ఇప్పుడు తొలిసారి నేను ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నాను. వయనాడ్‌లో యూడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ నేతలకు, నా కుటుంబానికి కృతజ్ఞతలు. వయనాడు ప్రజలకు ప్రాతినిధ్యం వహించడాన్ని ఓ గొప్ప గౌరవంగా, బాధ్యగా భావిస్తున్నాను’’ అని ఆమె చెప్పుకొచ్చారు.