ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కోసం తెలంగాణ ప్రభుత్వం తెగ కసరత్తులు చేస్తోంది. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కోసం ప్రత్యేక యాప్‌ను లాంచ్ చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti) వెల్లడించారు. సచివాలయంలో యాప్‌ను మంత్రి పరిశీలించారు. యాప్‌లో పలు మార్పులు చేయాల్సి ఉందని, వాటిని వీలైనంత త్వరగా సరిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామని, ఇందులో చేయాల్సిన మార్పులు పూర్తి చేసి వచ్చే వారం ఈ యాప్‌ను లాంచ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ యాప్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల పంపిణీ వరకు అన్నీ ట్రాక్ చేస్తామని, ఈ ప్రక్రియలో వీలైనంతగా సాంకేతికతను వినియోగించేలా చూస్తున్నట్లు తెలిపారు.
‘‘కొద్దిరోజుల్లోనే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని(Indiramma Housing Scheme) ప్రారంభిస్తాం. ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగేలా చూడటం కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించాం. ఈ యాప్ పనులను కూడా తుది దశకు చేరుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ యాప్ తెలుగు వెర్షన్‌లో కూడా ఉండాలని అధికారులకు వివరించాం. రాష్ట్రంలోని ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇంటిని నిర్మించి ఇవ్వడమే మా ప్రభుత్వ ధ్యేయం’’ అని తెలిపారు మంత్రి పొంగులేటి(Ponguleti).