తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ చేపట్టిన జిల్లాల సంఖ్య తగ్గింపు చర్యలపై ఆయన మండిపడ్డారు. చెప్పిందేంటి.. చేస్తోందేంటని కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీశారు బండి. ఇచ్చిన హామీలను మర్చిపోవడం కాంగ్రెస్‌కు అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్ ఇచ్చిన హమీల నుంచి ఎందుకు పక్కదారి పడుతోందని ప్రశ్నించారు. జిల్లాలు, మండలాల పునఃవ్యవస్థీకరణను సమీక్షిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు జిల్లాల సంఖ్యను తగ్గించడంపై ఎందుకు దృష్టి పెడుతోందని నిలదీశారు. ఇచ్చిన మ్యానిఫెస్టోలో ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందా అని చురకలంటించారు. ఒక్కసారిగా తెలంగాణలో జిల్లాల సంఖ్యను తగ్గించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు యోచిస్తోందని ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉన్న 10 జిల్లాలను బీఆర్ఎస్ ప్రభుత్వం 33 జిల్లాలుగా విభజించింది. వీటిలో కొన్ని జిల్లాలను కేవలం రాజకీయ లబ్ది కోసమే బీఆర్ఎస్ ఏర్పాటు చేసిందని గతంలోనే రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు కేవలం జిల్లాల సంఖ్యను తగ్గించడంపైనే ప్రభుత్వం దృష్టి పెడుతోంది. అయితే రాష్ట్రంలో జిల్లాల పునఃవ్యవస్థీకరణ, అవసరమైతే జిల్లాల సంఖ్య తగ్గించాలా వద్దా అనేవి సూచించడం కోసం ప్రత్యేక న్యాయ కమిషన్‌ను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోందని గతంలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెల్లడించారు.