తమిళ హీరో శివకార్తికేయన్(Sivakarthikeyan), సాయిపల్లవి(Sai Pallavi) నటించిన అమరన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే కలెక్షన్లు రాబడుతోంది. దీపావళి స్పెషల్‌గా అక్టోబర్ 31న విడుదలైన సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది. అయితే తాజాగా ఈ సినిమా వల్ల తాను ఎన్నో ఇబ్బందులు పడుతున్నానంటూ విఘ్నేశన్ అనే విద్యార్థి.. మూవీ(Amaran) టీమ్‌కు నోటీసులు పంపాడు. ఈ సినిమా కారణంగా తనకు ఎంతో మంది గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి విసిగిస్తున్నారని, దాని వల్ల తాను ఎంతో మానసిక వ్యధకు గురవుతున్నానని చెప్పాడు. తనకు నష్టపరిహారం సినిమా టీమ్ రూ.1.1 కోట్లు చెల్లించాలని అతడు డిమాండ్ చేస్తున్నాడు.
అసలేం జరిగిందంటే..
మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా వచ్చిన అమరన్(Amaran) సినిమాలో ఓ సీన్‌లో సాయిపల్లవి.. హీరోకు తన ఫోన్ నెంబర్ ఇస్తుంది. అది నిజంగానే సాయి పల్లవి నెంబర్ అనుకున్న అమ్మడి అభిమానులు ఆ నెంబర్‌కు తెగ ఫోన్లు చేస్తున్నారు. కానీ ఆ నెంబర్ తనదని ఇంజనీరింగ్ చదువుతున్న విఘ్నేశన్ తెలిపాడు. రోజూ తన వందల కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయని, వాటితో తనకు ప్రశాంతత అనేదే కరువైపోయిందని విఘ్నేశన్ వాపోతున్నాడు. తన అనుమతి లేకుండా తన ఫోన్ నెంబర్‌ను సినిమాలో అనుమతించినందుకుగానూ మూవీ టీమ్ తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు. మరి దీనిపై మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.