మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చురకలంటించారు. తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్నీ అమలు చేశామని మహారాష్ట్రాలో అబద్దాలు చెప్పారని, అందువల్లే ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేసిన దొంగ ప్రచారానికి ఓటమితో మూల్యం చెల్లించారని అన్నారు కేటీఆర్.
తెలంగాణ ప్రజలకు చెందిన రూ.300 కోట్లతో పెద్ద ఎత్తున ప్రకటనలు చేసి తిమ్మిని బమ్మిని చేద్దామనుకున్న రేవంత్(Revanth Reddy) పన్నాగం మహారాష్ట్రలో పారలేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఆడుతున్న దొంగాటలకు ఓటమితో మరాఠా ప్రజలు చెక్ పెట్టారని దుయ్యబట్టారు. తెలంగాణలో ప్రతి మహిళకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చకుండానే మహారాష్ట్రలో మహిళలకు రూ.3000 ఇస్తామని నయవంచన చేయాలన్న కాంగ్రెస్ కుట్రను మహారాష్ట్ర ప్రజలు పసిగట్టారని కేటీఆర్(KTR) చెప్పారు.
‘‘.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇక్కడి ప్రజలను మోసం చేస్తున్న తీరును మహారాష్ట్ర ప్రజలు గుర్తించారు. తెలంగాణలో ఏదో పొడిచేశామని రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు ప్రచారాలను మరాఠా ప్రజలు నమ్మలేదు. మీ ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, ఛాపర్లు అన్ని కూడా కాంగ్రెస్‌ను ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాయి.
మహారాష్ట్ర(Maharashtra)లో అదానీని గజదొంగగా అభివర్ణించి తెలంగాణలో అదే అదానీ(Adani)తో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న విషయాన్ని ప్రజలు గుర్తించారు. ఇకనైనా రేవంత్ చేపట్టిన ముఖ్యమంత్రి పదవికి న్యాయం చేయాలి. ముఖ్యమంత్రిగా తన ప్రాథమిక కర్తవ్యంపై దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఏడాది క్రితం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే పని మీద దృష్టి పెట్టాలి’’ అని రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చారు.