లగచర్లలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్(Prateek Jain) సహా పలువురు అధికారులపై దాడి జరిగిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్(Patnam Narender Reddy)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన రిమాండ్ బుధవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం ముందు పోలీసులు హాజరుపరిచారు. ఆయన రిమాండ్‌ను పొడిగించాలని, మరింత విచారణ చేయాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు.
పోలీసుల అభ్యర్థన మేరకు పట్నం నరేందర్ రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల అంటే డిసెంబర్ 11 వరకు పట్నం నరేందర్ రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించింది. కాగా మరోవైపు వికారాబాద్ కోర్టులో పట్నం నరేందర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిసింది. మరోవైపు పట్నం నరేందర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం.. లగచర్ల(Lagacharla), పోలేపల్లిలో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వ కసరత్తులు చేపట్టింది. ఇందులో భూసేకరణపై ప్రజాభిప్రాయం సేకరించడం కోసం లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా పలువురు అధికారులు వెళ్లారు. వారిపై స్థానికులు, గ్రామస్తులు అంతా కలిసి కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కలెక్టర్‌పై దాడి చేసేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తిని గుర్తించారు. అతడు నిందితుడు పట్నం నరేందర్ ప్రధాన అనుచరుడు సురేష్ అని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించే పట్నం నరేందర్(Patnam Narender Reddy)ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు పోలీసులు.