తెలంగాణ రైతులు జీవితాల్లో గతేడాది డిసెంబర్‌లో కొత్త వెలుగు విరసిల్లాయని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. ప్రభుత్వ మార్పు రైతుల జీవితాన్ని మార్చేసిందని, వారి చరిత్రను మలుపుతిప్పిందంటూ ఆయన ఈరోజు తన ఎక్స్(ట్విట్టర్) ఖాతా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజావిజయోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం రైతు పండగ కార్యక్రమాలను చేపట్టింది. ఈ రైతు పండగ ముగింపు సభకు హాజరుకావడం కోసం సీఎం రేవంత్ ఈరోజు మహబూబ్‌నగర్‌కు వెళ్ళనున్నారు. ఈ సందర్బంగానే ఆయన ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు.
‘‘ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు. ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసింది. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ.. రూ.7,625 కోట్ల రైతు భరోసా… ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్… రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్… రూ.1433 కోట్ల రైతుబీమా… రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం… రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి.
ఒక్క ఏడాదిలో.. రూ.54 వేల కోట్తో రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం. ఇది నెంబర్ కాదు. రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం. ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కలిసి రైతు పండుగలో పాలు పంచుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నా’’ అని రేవంత్(Revanth Reddy) తన పోస్ట్‌లో పేర్కొన్నారు.