తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC)కు తెలంగాణ ప్రభుత్వం కొత్త ఛైర్మన్‌ను నియమించింది. ప్రస్తుత ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 3తో ముగియనున్న క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టీజీపీఎస్‌సీ కొత్త ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం(Burra Venkatesham)ను నియమించింది. ఈ మేరకు ఆయన నియామకాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా అంగీకరించారు.
ఈ క్రమంలో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పుడు ఆయన నిర్వర్తిస్తున్న అన్ని పదవులకు కూడా బుర్రా వెంకటేశం రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే ఆయన వీఆర్ఎస్‌కు కూడా దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డిసెంబర్ 2న బుర్రా వెంకటేశం.. టీజీపీఎస్‌సీ(TGPSC) ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత బుర్రా వెంకటేశం.. తెలంగాణకు కేటాయించబడ్డారు. తెలంగాణలో హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా, సమాచార పౌరసంబంధాల కమిషనర్‌గా ఆయన విధులు నిర్వర్తించారు. 2015లో తెలంగాణ రాష్ట్ర భాష, సంస్కృతి, పర్యాటక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2017లో డిసెంబర్ 15 నుంచి 19 వరకు అంటే కేవలం ఐదు రోజుల పాటు తెలుగు మహాసభల కోర్ కమిటీ సభ్యుడిగా, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023 డిసెంబర్ 17న తెలంగాణ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, కాలేజీ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అందుకున్నారు. 2024 మార్చి 16న గవర్నర్ తమిళిసై కార్యదర్శిగా బుర్రా అదనపు బాధ్యతలు తీసుకున్నారు.