‘శిల్పాశెట్టి(Shilpa Shetty) ఇంట్లో ఈడీ సోదాలు’ అంటూ వస్తున్న వార్తలపై రాజ్‌కుంద్రా(Raj Kundra) ఘాటుగా స్పందించారు. దయచేసి నిజాలనే ప్రచురించాలంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్ల నుంచి ఈ కేసులకు సంబంధించి విచారణ జరుగుతుందని, అందుకు తాను కూడా పూర్తిగా సహకరిస్తున్నానని ఆయన తెలిపారు. ఎంతటి సంచలనాత్మక కేసుల్లో అయినా చివరకు న్యాయమే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అదే విధంగా సంబంధం లేని విషయాల్లో తన భార్య పేరును పదేపదే వాడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, దయచేసి తమ గోప్యతను గౌరవించాలంటూ రాజ్‌కుంద్రా(Raj Kundra) పేర్కొన్నారు. ‘‘కేసు ఏదైనా అంతిమ విజయం న్యాయానిదే అవుతుంది. నాలుగేళ్లుగా ఈ కేసు నడుస్తోంది. నేను కూడా ద్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నాను. సంబంధంలేని అంశాల్లోకి నా భార్య పేరును లాగొద్దు. మా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి’’ అని వెల్లడించారు.
అయితే అశ్లీల చిత్రాలను నిర్మించి పలు యాప్‌లు, వెబ్‌సైట్‌లలో ప్రసారం చేస్తున్నారంటూ రాజ్‌కుంద్రాపై 2021లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగానే రాజ్‌కుంద్రాను అరెస్ట్ కూడా చేశారు. సినిమా అవకాశాల కోసం ముంబైకి వచ్చే యువతులను ట్రాప్ చేసి ఇటువంటి వీడియోలు చిత్రీకరిస్తున్నారని, వీటి ద్వారా భారీ మొత్తంలో ఆయన అర్జించారని పోలీసులు తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ విచారణలో భాగంగానే ముంబై(Mumbai), ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లోని 15 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తోంది.