సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు(AB Venkateswara Rao) ఊరట దక్కింది. ఆయనపై వైసీపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) కొట్టివేసింది. ఒకే కారణంతో ప్రభుత్వం తనను రెండుసార్లు సస్పెండ్ చేయడం చట్ట విరుద్దమంటూ ఆయన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిపై సుధీర్ఘ విచారణ జరిపిన క్యాట్(CAT).. సస్పెన్షన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే వెంటనే ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని.. సస్పెన్షన్ కాలంలో రావాల్సిన జీతం, ఇతర భత్యాలను చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కాగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు నిఘా చీఫ్‌గా పనిచేశారు. వైసీపీ(YCP) అధికారంలోకి రాగానే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. టీడీపీ హయాంలో రక్షణ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సస్పెండ్ చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారించిన హైకోర్టు సస్పెన్షన్ ఎత్తివేసింది. అయితే హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయగా.. సుప్రీంకోర్టు కూడా ఆయనకు అనుకూలంగా తీర్పును ప్రకటించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఆయనకు స్టేషనరీ అండ్ ప్రింటింగ్ అధికారిగా పోస్లింగ్ ఇచ్చింది. అయితే రెండు వారాల తర్వాత మళ్లీ వేటు వేసింది. దీంతో ఆయన(AB Venkateswara Rao) కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా తాజాగా అనుకూలంగా తీర్పు వచ్చింది.