విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు(Ambedkar Statue) రంగం సిద్ధమైంది. రేపు(శుక్రవారం) సాయంత్రం సీఎం జగన్.. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ అద్భుతమైన కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలందరూ తరలిరాలని ఆయన పిలుపునిచ్చారు. రూ.400కోట్ల వ్యయంతో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరిట బందర్ రోడ్డు(Bandar Road)లో 125 అడుగులు భారీ అంబేద్కర్ విగ్రహం ప్రభుత్వం నిర్మించింది. 81 అడుగుల ఎత్తైన పీఠంపై 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించడంతో.. మొత్తం విగ్రహం ఎత్తు 206 అడుగులుగా ఉంది. దీంతో దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా నిలవనుంది.
మరోవైపు దాదాపు 19 ఎకరాల్లో స్మృతివనం కూడా ఏర్పాటు చేశారు. స్మృతివనంలో అంబేద్కర్ ఫొటో గ్యాలరీతో పాటు ఆయన జీవిత విశేషాలు, కన్వెన్షన్ హాల్, యాంఫీ థియేటర్, మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. లైబ్రరీతో పాటు ఎక్స్‌పీరియన్స్ సెంటర్ కూడా సిద్ధం చేశారు. ఇక గ్రౌండ్ ఫ్లోర్‌లో నాలుగు హాళ్లు ఉన్నాయి. ఒక్కోటి 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా.. అందులో ఒకటి సినిమా హాలు కాగా మిగిలిన మూడు హాళ్లలో ఆయన చరిత్రను తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంటుంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ(Ambedkar Statue) కార్యక్రమం నేపథ్యంలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.